Brahmashri Brahmarshi Brahmalina Jagadguru Vedanta Lakshmanaryula Biography

రాయలసీమ అనంతపురంజిల్లా,బుక్కరాయసముద్ర నివాసులగు పద్మశాలి,పొడరాళ్ళరామక్క తిరువెంగలప్పగారి ద్వితీయపుత్రుడై 1900 సంవత్సరమున జన్మించిరి.సంస్కారజీవులు గనుక తన 8వ ఏటనే తన పెదతండ్రి పుత్రుడైన, పొడరాళ్లరామస్వామి గారి ద్వారా పురాణ శ్రవణమును గావించిరి. పొడరాళ్లరామస్వామి పురాణకథముల, వేదాంతాంశముల,పౌరాణికుడు. స్వామిగారికి కూడా, వాటినినేర్వవలెనని తలంపు గలిగియుండెను. బాల్యముననే ప్రాథమికవిథ్యా పట్టబద్రులై అనంతపురం తాలూక, సిద్ధారాంపురం మజరా, కొత్తపల్లిగ్రామములో విద్యాబోధక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి భారత, భాగవత,రామాయణములకు అర్థములచెప్పుచూ శ్రోతలను ఆనందింపజేసెడివారు. తాడిపత్రి తాలూకా,పోతిరెడ్డిపల్లి వాస్తవ్యులైన శ్రీవెంకటయ్య గారిచే, గురుబోధను శ్రవణుచేసి,గురు ఉపదేశమును బొంది, శ్రీమతి గంగిరెడ్డి పాపమ్మగారి ఇంట వేదాంత గ్రంధముల వినిపించెడివారు. ఉపాధ్యాయ వృత్తిలోనుండియే గురువుల సేవించుచు బ్రహ్మవిధ్యను సంపాదించుచుండెడివారు. శాస్త్రసంభంధ బ్రహ్మవిధ్యను రూఢిగ సంపాదించితినని భావించి యుండిరి. బళ్ళారి జిల్లా,రాయదుర్గం తాలూకా,గొల్లపల్లి గ్రామములో జరిగిన శివరాత్రి సభలో బ్రహ్మశ్రీ యాదాటి నరహరి గురుదేవుల భోదామృతమును గ్రోలి శాస్త్రములకును, నరహరి గురుదేవుల భోదనకుగల తారతమ్యమును గుర్తించి నరహరిగురు రహస్యార్థముల బ్రహ్మవిధ్యా రహస్యములను వారికృపచే పూర్ణముగా గ్రహించిరి, గాని మనస్సు నిలువని కొరత మాత్రము మిగిలియుండెను. ఆ కొరత దైవసన్నిభుడైననొక మహాత్మునిచే తీర్చుకొని ఇద్దరినేకము జేసుకొని నరహరి స్వారాజ్య జగద్గురువుల భక్తుడై విలసిల్లెను. శ్రీనరహరిసద్గురు ముఖమున సంస్కృత, వేద, వేదాంత, వ్యాకరణ, భాష్య శ్యాస్త్రములను కూలంకషముగా నభ్యసించిరి. శ్యాస్త్ర పరిచయము, శ్యాస్త్రమంత్ర రహస్యార్థములు, మనస్సు నిలిచెడి గురుకీలుచే అనుభవజ్ఞానమును పరిపూర్ణముగా పొంది తృప్తినొందిరి. ఉపనిషత్, గీతాబ్రహ్మ సూత్రములగు ప్రస్థానత్రయములకు ఇంతవరకు వ్రాసిన భాష్య టీకా తాత్పర్యములు, బాహ్యముగానే నడచినవనియు రహస్యార్థములవైపు త్రిప్పలేదనియు నొక అభిప్రాయము వారి కృపచే హృదయమునందు ఉద్భవించినది.తాడిపత్రి శ్రీ మూలా లక్ష్మినారాయణస్వామిగారి ధన సహాయమున భగధ్గీతను, రహస్యార్థముల, టీకా తాత్పర్య విశేషార్థములతో, శ్రుతి యుక్తి అనుభవ పూర్వకముగా రచియించి శ్రీస్వారాజ్య భగవధ్గీతా యనుపేర 23-11-1939 వ సంవత్సరమున ముద్రించి వెల్లడి చేసిరి. ఈశ కేన ముండక మాండుక్య తైత్తిరీయోపనిషత్తులకు అంతరార్థమునువ్రాసి పుస్తకములను అచ్చువేయించిరి .ఉపనిషన్నిక్షిప్త, రత్నముల ముముక్షు లోకమునకు నందజేసిరి, కడప జిల్లా జమ్మలమడుగు వాస్తవ్యులైన శ్రీ చౌడం తిరువెంగలప్పగారి ద్రవ్యసహాయమున తైత్తిరియోపనిషత్తు నందలి అమృతము పంచబడినది. అనంతపురం శ్రీగొందిపద్దకొండప్పగారి ద్రవ్యసహాయమున బ్రహ్మసూత్రముల, రహస్యార్థములామృతము లోకమునకు అందింపబడెను. ప్రొద్దుటూరు నివాసియగు శ్రీవారిశిష్యులనగు బ్రహ్మశ్రీ మార్తల వీరారెడ్డిగారి సంభాషణ రూపమున గీతా నవనీతమునువ్రాసి జిజ్ఞాసువులకు జ్ఞాన రత్న వర్షముగా కురిసిన మేఘముగా శ్రీవారు ప్రపంచ విఖ్యాతి గాంచిరి.ప్రపంచమునగల సర్వమానవుల దేహోపాదియందు దేవుడు ఆత్మరూపమున నున్నాడనియు, అందరియందు వేదములే అంగములుగా గల సూక్ష్మశరీరమున్నదనియు, అందరిలోహంసయనెడు శ్వాస ఆడుచున్నదనియు, ఈశ్వర సంతానమైన సమస్త మానవులు, బ్రహ్మవిధ్యను, బ్రహ్మనిష్టను అనుష్టించి, దుఃఖనివృత్తి, పరమానందప్రాప్తి, రూప, మోక్షంబగు, స్వారాజ్యసింహాసనాసీనులై, పరమశాంతిని బొంది తరించుటకు సహజ వారసత్వము గలవారై యున్నారనియు, జాతి, కులమతములు, మానవకల్పితములని భావించి ''సర్వేజనాస్సుఖినోభవంతు" అన్నఆర్యోక్తిని ‌ననుసరించి 1921 సంవత్సరమున మహోన్నతమైన శ్రీ స్వారాజ్యపీఠము వ్యవస్థాపకులై దేశము నాలుగు చెరుగుల స్వారాజ్య సంఘములు నెలకొల్పి విరివిగా ప్రచారము గావించిరి.

శ్రీవారు రచించి వెలువరించిన గ్రంధములు స్వారాజ్య భగవద్గీతా, స్వారాజ్యము, దేవుడు, ముక్తి, గాయత్రి మంత్రరహస్యము, ఉత్తరగీత, జీవమణి, పరమేశ్వర పంచముఖములు, సోపానాలు, పురుషసూక్తము, నారాయణ శతకము, ముక్తి సూక్తములు, వేద రహస్యములు, జ్ఞానసముద్రము, అనుభవామృతార్ణవము, గీతా మహాత్యము, గీతా మధనమ, దేవభాషార్కము, గీతానవనీతము మొదలగు అనేక గ్రంధముల రచించి లోకమున వ్యాపింపచేసిరి. 1942 వ సంవత్సరంలో ప్రొద్దుటూరు నందును శిష్యులచే స్వారాజ్యాశ్రమమును, ఆ తరువాత అనిమెల యందు కైవల్యాశ్రమము పేర, అనంతపురమునందును, ఇంకను అనేకచోట్ల ఆశ్రమములను నిర్మించి 10 లక్షలకు పైగా శిష్యకోటికి జ్ఞానదానము చేసి, కొందరిని గురువులుగా తయారుచేసిరి.చాలాకాలము క్రిందటనే తాడిపత్రి పినాకినీనదీ తీరము నందు స్వారాజ్యాశ్రమమును నిర్మించి 1945, 46, 47 సం||ల వరకు మూడు సంవత్సరములు మౌనదీక్ష ఆచరించిరి. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణములో 1948లో హిందూమత ప్రచారక శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులకును, శ్రీవారికిని 2 మాసములు జరిగిన సంవాదమునందు 29-12-1948 తేదిన ఆ పండితులవారిచే బ్రహ్మజ్ఞానమును ప్రతివ్యక్తి సంపాదించుకోవచ్చుననియు, బ్రహ్మజ్ఞానముగల ప్రతివ్యక్తియు బ్రాహ్మణుడే అనియు ఒప్పించిరి.1962 వ సంవత్సరములో కాకినాడ పట్టణములో సుమారు ఆరు మాసములుగా జరిగిన వేదపరిషత్ మహాసభయందు ఉద్దండ పండితుల వేదాంత ప్రశ్నలకు సమాదానము చెప్పి గాయత్రీ మహామంత్ర రహస్యార్ధమును శ్రుతి, యుక్తి, అనుభవపూర్వకముగా నిరూపించి నవరత్నఖచిత సువర్ణ కిరీటమును, భుజకీర్తులను, మకరకుండలములను, హస్తకంకణ ఓంకార పతక అంగుళ్యాభారణములచే సత్కరింపబడిరి.కడప పట్టణమ నందు స్వారాజ్య సంఘమును బ్రహ్మ స్పర్శవేది సంఘముగా రిజిస్టరు చేయించి 1968 లో “సత్యాన్వేషిణి” అను మాస పత్రికను వారు స్వరూప సిద్ధి నొందువరకు నడిపిరి. 1972 వ సంవత్సరము నుండి జగద్గురు పాటశాలను నడుపుచు, రాక్షస నామ సం||ర ఆషాఢ శుద్ద ద్వాదశిన 20-7-1975 తేది ఆదివారము రాత్రి 11 గంటలకు ప్రొద్దుటూరు నందు శ్రీ స్వారాజ్యాశ్రమమున తనువు చాలించి విదేహముక్తులై వెలసిరి. ప్రొద్దుటూరు శ్రీ స్వారాజ్యాశ్రమమున స్వామీ వారి భౌతికదేహము ఆశ్ర్రమమునందే నిక్షిప్తము గావింపబడి యున్నది.

- శ్రీ వేదాంతం లక్ష్మణార్యులు